TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 3:43 pm Posted by : TEHELKA NEWS

ప్రజల దాహార్తిని తీర్చిన ప్రజానేత షబ్బీర్ అలీ

కామారెడ్డిలో నీటి ఎద్దడిని తీర్చిన అపర భగీరథుడు మహమ్మద్ అలీ షబ్బీర్— మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

 

కామారెడ్డి : జిల్లా  కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాల క్రితం కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాలు తీవ్ర తాగునీటి సమస్యతో సతమతమయ్యేవని గుర్తు చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టే పరిస్థితులు ఉండేవని తెలిపారు.అలాంటి క్లిష్ట సమయంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన మహమ్మద్ అలీ షబ్బీర్, కామారెడ్డి ప్రాంతానికి శాశ్వత తాగునీటి పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అపార కృషి చేశారని పేర్కొన్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కామారెడ్డికి తరలించేందుకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని, దాదాపు 110 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు ఏర్పాటు చేయించారని తెలిపారు. మల్లన్నగుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేపట్టి గ్రామాలు, పట్టణాలకు తాగునీటి సరఫరా అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు పదేళ్ల పాటు కామారెడ్డి ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా పోయిందన్నారు.అయితే పెరుగుతున్న జనాభా, అభివృద్ధి అవసరాల నేపథ్యంలో నీటి అవసరాలు మరింత పెరిగాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖల అనుమతుల విషయంలో ఎదురైన ఆటంకాలను షబ్బీర్ అలీ స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయని వెల్లడించారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే గత ప్రభుత్వ హయాంలో కామారెడ్డి పట్టణానికి అందిన కేవలం 4 MLD నీటి సరఫరా, ఏకంగా 19 MLDలకు పెరిగి పట్టణానికి శాశ్వత నీటి భద్రత కల్పించబడుతుందని తెలిపారు.

ఈ వేసవి ప్రారంభం నుంచే షబ్బీర్ అలీ ప్రతిరోజూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలు తీసుకున్నారని, ఫలితంగా ప్రస్తుతం పట్టణానికి రోజుకు 8 నుంచి 10 MLDల వరకు తాగునీరు అందుతోందన్నారు. గత పదేళ్లుగా ప్రతి వేసవిలో వార్డులన్నింటిలోనూ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆయన పట్టుదల, నిరంతర కృషి వల్ల ట్యాంకర్ల అవసరం లేకుండా నల్లాల ద్వారానే ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందుతోందని తెలిపారు.ప్రస్తుతం పట్టణంలో 10 వాటర్ ట్యాంకులు ఉండగా, అమృత్ 2.0 పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో మరో 9 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయని వెల్లడించారు. రూ.11.89 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఈ ట్యాంకులు పూర్తయితే, 19 MLDల నీటి సరఫరాతో పట్టణంలోని తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కు పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఉమారాణి శ్రీనివాస్ అన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వినోద్, కౌన్సిలర్లు వాజీద్, జావేద్, అంజాద్, బబ్లు, కాళ్ల గణేష్, కళ్లెం సత్యం, అన్వర్, లడ్డు, సిద్ధిక్, యూనస్, చిట్టిబాబు, భూపతి, పట్టణ అధ్యక్షుడు సందీప్, గాజీ, గంప ప్రసాద్, సురేష్‌తో పాటు పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.