
కామారెడ్డి, మే 21 :జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు మరియు వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించిన దూరదృష్టి నాయకుడని పేర్కొన్నారు. యువతకు ఆయన ఎల్లప్పుడూ ఆదర్శమూర్తిగా నిలిచారని అన్నారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందించారని కొనియాడారు.

యువత రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించిన రాజీవ్ గాంధీ, ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు మరింత అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త ఒరవడులు తీసుకువచ్చి, దేశ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అలే మల్లికార్జున్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు అన్వర్, షేరు, రామ్మోహన్, గణేష్, సత్యం, సిద్దిక్, వాజిద్, అంజాద్, లడ్డు, సాయిలు, జావీద్, బబ్లు, మోతీలాల్, కో-ఆప్షన్ సభ్యులు గొనె సునీత శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, చాట్ల రాజేశ్వర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.