
హైదరాబాద్, మే 21, 2026:
కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao ను కలిసి తమ సమస్యలను వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ ఎత్తున చెట్ల నరికివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రతినిధుల విన్నపాన్ని ఆలకించిన కేటీఆర్ మాట్లాడుతూ, కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన “లంగ్స్ స్పేస్” అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్క్ ఉనికి, చెట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండర్‌గ్రౌండ్ విధానంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని, సాంకేతిక పరిజ్ఞానం మరియు సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అంశంలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవడం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.


