🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 7:06 pm Posted by : TEHELKA DAILY

రైతులకు కరెంట్ ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్

News Image
* ఎల్ నినో ప్రభావం ఉందని ముందే హెచ్చరికలున్నా పెడచెవిన పెట్టి కృష్ణా, గోదావరి జలాలను సముద్రం పాలు చేశారు
* ₹4 రూపాయల యూనిట్ విద్యుత్ వదులుకొని ₹15 రూపాయల కోసం వెంపర్లాట.. పాలకుల అసమర్థతకు పరాకాష్ట
* రిపేర్ల నెపంతో నిండుకుండలాంటి సింగూర్ ప్రాజెక్టును ఖాళీ చేయించిన మంత్రి దామోదర రాజనర్సింహ
* తెలివిలేని సీఎం.. బుర్రతక్కువ మంత్రులతో రాష్ట్ర పాలన భ్రష్టుపట్టింది: క్రాంతి కిరణ్ ధ్వజం
* అన్నాసాగర్ సబ్ స్టేషన్ వద్ద రైతుల భారీ ధర్నా.. డీఈ (DE) రావాల్సిందేనంటూ రోడ్డుపై బైఠాయింపు.

వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం చేతకాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఆందోల్ మండలం అన్నాసాగర్ సబ్ స్టేషన్ ఎదుట మండలంలోని వివిధ గ్రామాల రైతులు చేపట్టిన భారీ నిరసన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. లో-వోల్టేజ్, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ (DE) స్వయంగా వచ్చి తమ సమస్యలు వినాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
నీటిని సముద్రం పాలు చేసి.. విద్యుత్‌ను అంధకారం చేశారు: క్రాంతి కిరణ్
ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అసమర్థ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు రాబోతున్నాయని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా పెడచెవిన పెట్టిందని ముందుచూపు లేకుండా కృష్ణా, గోదావరి నదుల జలాలను ఒడిసిపట్టకుండా సముద్రం పాలు చేశారని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల పాటు నిరంతరాయంగా వచ్చిన నాణ్యమైన విద్యుత్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేశారని గతంలో యూనిట్ రూ.4 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలున్నా వదులుకొని, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ.15 పెట్టి కొనేందుకు ప్రయత్నించడం వీరి అవినీతి, అసమర్థ పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు. తెలివిలేని ముఖ్యమంత్రి, బుర్రతక్కువ మంత్రులతో ఈ సర్కార్ నడుస్తోంది. అందుకే రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి అని ఎద్దేవా చేశారు.
సింగూర్ ప్రాజెక్టును ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే!
స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ వైఖరిని క్రాంతి కిరణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ, నిండుకుండలా కళకళలాడుతున్న సింగూర్ ప్రాజెక్టు నీళ్లను గేట్ల రిపేర్ల నెపంతో కిందికి వదిలేసి ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకుండా ఖాళీ చేయించి, నేడు ఆందోల్ నియోజకవర్గ రైతాంగాన్ని సాగునీరు, తాగునీటికి తండ్లాడేలా చేసిన పాపం ముమ్మాటికీ మంత్రి దామోదరదేనని నిప్పులు చెరిగారు. ఎండిన పంట పొలాలను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించాలని నష్టపోయిన రైతులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.
కౌలు ఎట్లా కట్టాలంటూ కౌలు రైతుల కన్నీళ్లు.. అధికారులను నిలదీసిన అన్నదాతలు
ఈ ధర్నాలో ఆందోల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు నడవక, పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని అన్నదాతలు ఏకరువు పెట్టారు. ఎకరానికి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే పైర్లు ఎండిపోతుంటే, ఇప్పుడు భూయజమానులకు కౌలు ఎలా చెల్లించాలని కౌలు రైతులు గుండెలు బాదుకున్నారు. కాంగ్రెస్ పాలన వద్దంటూ నినాదాలు చేస్తూ రోడ్డుకు రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. డీఈ ఘటనా స్థలానికి వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపేవరకు కదిలేది లేదంటూ రహదారిపై ధర్నాకు దిగారు.
ఆందోల్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ రెడ్డి అధ్యక్షత న జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మాసంపల్లి నారాయణ, లింగాగౌడ్ లతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, రైతు నాయకులు మరియు ఆందోల్ మండల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home