🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 11:59 am Posted by : TEHELKA DAILY

యువ న్యాయవాది ఐశ్వర్య మృతిపై న్యాయవాదుల ఆగ్రహం మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఐశ్వర్యకు న్యాయం చేయాలని క్యాండిల్ ర్యా

News Image
హైదరాబాద్‌: అక్టోబర్ 16:

మెడికవర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యువ న్యాయవాది ఐశ్వర్య మృతి చెందిందని ఆరోపిస్తూ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోరం, ఏఎంఎస్ లా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బీడీ కాలనీలోని ఏఎంఎస్ లా కాలేజీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులు పాల్గొని ఐశ్వర్య మృతికి సంతాపం తెలిపారు. కొవ్వొత్తులు చేతబట్టి న్యాయం కోసం నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వారి ప్రాణాలను కాపాడటం వైద్యుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కరి ప్రాణం పోయినా ఆ కుటుంబం జీవితాంతం తీరని వేదనను అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతి ఆమె కుటుంబానికి మాత్రమే కాకుండా న్యాయవాదుల సమాజానికి కూడా తీరని లోటని అన్నారు.
ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రులలో వైద్య సేవల పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాలని కోరారు.
యువ న్యాయవాది ఐశ్వర్యకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.
ఈ క్యాండిల్ ర్యాలీలో అడ్వకేట్లు తారక మహేశ్వరి ,పెండo మానస ,హరి చందన, షారోన్ ,శ్రీకాంత్ ,స్పర్శ, స్రవంతి, న్యాయ విద్యార్థి సేన హర్షద్, ఎస్ఎఫ్ఐ నాగేందర్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home