🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 12:00 pm Posted by : TEHELKA DAILY

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య, రక్తదాన శిబిరం

News Image
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య, రక్తదాన శిబిరం

హైదరాబాద్:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బిజెపి మహిళా మోర్చా సిటీ అధికార ప్రతినిధి నలువాల కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్, సేవా భారతి సహకారంతో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యం కావాలని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.
ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ముఖ్య అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ్ రెడ్డి, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, సేవా భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home