జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై మంత్రివర్గ ఉపసంఘం వెంటనే నిర్ణయం తీసుకోవాలి టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్య్లూజేఎఫ్) యాక్టింగ్ ప్రెసిండెంట్ పిల్లి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి బసవపున్నయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇండ్ల స్థలాల విషయాన్ని తేల్చాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని త్యాగరాయగాన సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనేక జిల్లాల్లో కొత్త అక్రిటిడేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ చాలా మంది అర్హులైన జర్నలిస్టులకు నిరాకరిస్తున్నారని చెప్పారు. కొత్త అక్రిడిడేషన్లతోపాటు జర్నలిస్టులకు హెల్త్కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కేసులు ఉన్నాయని చెప్పి కొంత మంది జిల్లా కలెక్టర్లు సీనియర్ జర్నలిస్టులకు కూడా అక్రిడిడేషన్లు ఆపుతున్నారనీ, ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ‘జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పోరాటం చేపడతామని హెచ్ఛరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, గుడిగ రఘు, బి రాజశేఖర్, కార్యదర్శులు బి దయాసాగర్, ఈ చంద్రశేఖర్, బి జగదీష్, కొప్పు నిరంజన్, సలీమ, గండ్ర నవీన్, వెంకటేష్,బి దామోదర్, బిక్షపతీ తదితరులు పాల్గొన్నారు.