చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం చేయండి!
సూర్యాపేట, నవంబర్ 3 (బ్యూరో చీఫ్ వై వి) సామాన్య ప్రజానీకంలో సైన్స్ ను ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకొనేందుకు కృషి చేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. “ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, దేశం కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్, పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్" అనే నినాదాలతో 1988 ఫిబ్రవరి 28న పురుడు పోసుకున్న జేవీవీ గత 38 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలతో తెలుగు ప్రజల జీవితంలో విడదీయలేని భాగంగా పెనవేసుకు పోయింది.
సైంటిస్టులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వృత్తి నిపుణులు సుమారు 40 వేల మంది సభ్యులున్న అతిపెద్ద సైన్సు ప్రచార సంస్థగా రాష్ట్రంలో ఎదిగింది. సైన్సుకు సంబంధించిన ఏ అంశం గురించి చర్చకు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, మూఢ నమ్మకాలు చెలరేగినా జనవిజ్ఞాన వేదిక తన కార్యకర్తలతో పరిష్కారాలకై పనిచేస్తున్నది.
విజ్ఞాన శాస్త్ర (సైన్స్) ఫలితాలు అందరికీ అందాలంటే ప్రజలు అందరూ అక్షరాస్యులు కావాలనే ఆవశ్యకతను గుర్తించి "అందరికీ విద్య-అందరిదీ బాధ్యత” అనే నినాదంతో అక్షరాస్యతా కార్యక్రమాన్ని ఒక మహెూద్యమంగా నిర్వహించింది. పాఠ్యపుస్తకాల్లో సీతమ్మ కథ ద్వారా మహిళల్లో చైతన్యం నింపి “సారా నిషేధం” దాకా ఉద్యమింపజేసింది. విద్యా బోధనలో అనేక నూతన విధానాల్ని ఆవిష్కరించింది. వేలాది మంది “సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ” ఇచ్చింది. అశాస్త్రీయ వైద్యాలకు వ్యతిరేకంగా బృహత్తర ప్రచారం నిర్వహించింది. కళాజాతాలతో ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచింది. పర్యావరణ పరిరక్షణకై “చెట్లు నాటితే క్షేమం—చెట్లు నరికితే క్షామం” అని నినదించి, రాష్ట్రమంతటా చెట్లు నాటి పలువురి ప్రశంసలనందుకొంది. అన్ని మౌలిక విలువలకు మూలమైన దేశభక్తిని పెంపొందించడానికి అనేక వర్క్‌షాపులు నిర్వహించింది. పుస్తకాలు ప్రచురించింది.
దేశ సమస్యల మౌలిక పరిష్కారాలు కనుగొనడానికై మేధావులతో వందలాది సెమినార్లు నిర్వహించింది. జేవీవీ కార్యకర్తలు కూల్డ్రింకులలోని కుళ్ళును కడిగారు. చేపమందులోని అశాస్త్రీయతను వెలికితీసారు.
దొంగస్వాములు, దొంగబాబాలు, దొంగఫకీర్లు, దొంగపాస్టర్ల బండారాన్ని బయటపెట్టారు. సామాన్య ప్రజానీకంలోనూ, మేధావి వర్గాల్లోనూ, అధికారుల్లోనూ, విద్యార్థినీ విద్యార్థుల్లోనూ జన విజ్ఞాన వేదిక మంచి పేరును సాధించుకుంది. పటిష్టమైన నిర్మాణం, అన్ని జిల్లాల్లో శాఖలు, ప్రజాస్వామ్యయుతమైన కార్యక్రమాల రూపకల్పన, త్యాగశీలత, నిరాడంబరత జన విజ్ఞాన వేదికకు ఆయువుపట్టు. శాస్త్ర ప్రచార రంగంలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2005 సంవత్సరంలో అత్యుత్తమ సైన్స్ ప్రచార సంస్థ అవార్డు ఇచ్చి గౌరవించింది.
మాతృభాషలో విద్యాబోధనావశ్యతను తెలియ జేసేందుకు గ్రామీణ పేద విద్యార్థులకు సులభశైలిలో మౌలిక, ఆధునిక విజ్ఞాన శాస్త్ర (సైన్స్) సంబంధిత అంశాల్ని పరిచయం చేసేందుకు జనవిజ్ఞాన వేదిక 1990 సంవత్సరం నుంచి ఒక సైన్స్ మాసపత్రికను “విద్యార్థి చెకుముకి” పేరుతో నడుపుతోంది. నేడు తెలుగులో వెలువడుతున్న ఏకైక పూర్తిస్థాయి వైజ్ఞానిక మాసపత్రిక విద్యార్థి చెకుముకి. రాష్ట్ర ప్రభుత్వంచే విద్యార్థినీ, విద్యార్థులు చదువదగిన పత్రికగా "చెకుముకి” పత్రిక గుర్తింపు పొందింది.
ఈ చెకుముకి పత్రిక నిర్వహణలో అంతర్భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులకు "చెకుముకి సైన్స్ సంబురాలు" పేరుతో ప్రతిభా పాటవ పరీక్షల్ని గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తోంది.
చెకుముకి సైన్స్ సంబురాలను నాలుగు దశల్లో... పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నాము.
విద్యార్థుల్లో సైన్స్ పట్ల అసక్తిని కల్గించడానికి, పరిశీలనా శక్తిని పెంచడానికి, శాస్త్రీయ ధృక్పథం అలవర్చడానికి, సృజనాత్మతకతను పెంపొందించేందుకు, వారిలో దాగివున్న అంతర్గత శక్తులను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులకు "చెకుముకి సైన్స్ సంబురాలు" పేరుతో ప్రతిభా పాటవ పరీక్షల్ని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తోంది.
ఈ 2026 సంవత్సరం చెకుముకి సైన్స్ సంబురాలు నిర్వహింపబడే తేదీలు:
పాఠశాల స్థాయి పరీక్ష నవంబర్ 12న జరగనుంది. (దీనిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సుమారు 7500+ లకు పైగా పాఠశాలల నుండి 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు).
మండల స్థాయి పరీక్షలు నవంబర్ 21 న జరగనుంది. (ఈ మండలస్థాయి చెకుముకి సైన్స్ సంబురాల పరీక్షల్లో, రాష్ట్రంలోని సుమారు 550+ మండలాల్లో 36 వేలమంది విద్యార్థులు పాల్గొంటారు).
జిల్లా స్థాయి పరీక్షలు నవంబర్ 28 న జరుగుతుంది. (ఈ జిల్లాస్థాయి పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, సుమారు 12 వేలమంది విద్యార్థులు పాల్గొంటారు).
ప్రతీ జిల్లా నుండి నాలుగు టీముల చొప్పున 33 జిల్లాల నుండి 132 టీములు రాష్ట్ర స్థాయి సైన్స్ సంబురాల్లో పాల్గొంటాయి.
ఈసారి రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలను 2026 డిసెంబర్ 11, 12, 13 తేదీలలో మేడ్చల్ జిల్లాలో CMR కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలలో 33 జిల్లాల నుండి 132 టీములు అనగా 396 మంది ఎంపిక చేయబడిన విద్యార్థులు, 132 గైడ్ టీచర్లు హాజరవుతారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మూడు రోజులు జరిగే రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల కార్యక్రమంలో విద్యార్థులకు రాత పరీక్ష, ఆక్టివిటి రౌండ్, క్విజ్, విజువల్ రౌండ్, క్రియేటివ్ రౌండ్, సైన్స్ ప్రయోగాలపై పోటీలు నిర్వహిస్తాము. సైన్స్ సెమినార్లు, శాస్త్రవేత్తలతో ముఖాముకి, ఆకాశ దర్శనం, సైన్స్ ఎగ్జిబిషన్, మిరాకిల్ ఎక్స్పోజర్, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ మ్యాజిక్, సైన్స్ గేములు, చరిత్రగతినిమార్చిన శాస్త్రవేత్తల ఎగ్జిబిషన్, వివిధ ప్రతిభా పాటవ పోటీలు, ఫీల్డ్ ట్రిప్, పుస్తక ప్రదర్శన, సైన్స్ కార్నివాల్ (స్ట్రీట్ సైన్స్ షో), ఇస్రో ఎగ్జిబిషన్లు అదనపు ఆకర్షణలుగా ఉంటాయి.
గతంలో మేము నిర్వహించిన అనేక విద్యా, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఆదరించారు. ఆతిథ్యమిచ్చారు. వాటిని విజయవంతం చేయడానికి ఎంతో సహకరించారు. ఆ విధంగానే ఈ సైన్స్ సంబురాల నిర్వహణలో కూడా అన్ని జిల్లాలకు చెందిన వివిధ సంస్థలు, సైన్స్ అభిమానులు, మేధావులు, నాయకులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, ప్రజలంందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము.
పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి & రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సైదులు, జాఫర్ కోరారు