ఏప్రిల్ 9 నుంచి – 21 వరకు
క్యూర్ పరిధిలోని 2- బిహెచ్ కె కాలనీల్లో దుకాణాల విక్రయాలు
అందుబాటులో 36 కాలనీల్లోని 1400 కు పైగా షాపులు
వచ్చే ఆదాయం ఆయా కాలనీల అభివృద్ధికే వినియోగం
హైదరాబాద్ : పరిసరాల్లోని క్యూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని 1400 కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ (ఏప్రిల్ 9 వ తేదీ)గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని 8 కాలనీల్లోని 273 షాపులకు ఈ నెల 9,10 తేదీల్లో వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.
వందలాది కుటుంబాలు నివసించే కాలనీల్లో, స్థానికుల అవసరాలకు అనుగుణంగా వ్యాపారకార్యక్రమాలు నిర్వహించుకునేలా 60-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు దుకాణాలను నిర్మించారు. వీటిని ఉన్నవి ఉన్నట్లుగా (As is where is condition) అన్న ప్రాతిపదికన విక్రయిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. వీటికి కనీస ధరలను కూడా బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా నామమాత్రంగానే నిర్దారించారు. ఆసక్తి ఉన్న వారు ఆయా కాలనీలను సందర్శించి, తమకు నచ్చిన, అనువైన దుకాణాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు నిర్ణీత మొత్తం ధరావతు (ఇంఎండి) తో వేలం నిర్వహించే తేదీల్లో ఉదయం గం.11.00 లోగా సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
ఈ నిధులను ఎందుకు వినియోగిస్తారంటే…..
పేదల వర్గాల ప్రజల కోసం మంచి వసతులతో, ఆహ్లదకరమైన పరిసరాలతో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల కాలనీలను నిర్మిస్తున్నది. ఈ కాలనీల నిర్వహణ నిమిత్తం, ఈ దుకాణాల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. ఆయా కాలనీల్లోని షాపుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అదే కాలనీ కోసమే వాడుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సహకార సంఘాల చట్టం క్రింద కాలనీ నివాసితుల సంక్షేమ సంఘాలను( వేల్పేర్ అసోసియేషన్లను) ఏర్పాటు చేస్తారు.వాటి ఆధ్వర్యంలో ఈ కాలనీల నిర్వహణ-అభివృద్ధికి జాయింట్ అక్కౌంట్ ద్వారా ఈ నిధులను వినియోగించనున్నారు. ఇందుకోసం షాఫుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పస్ ఫండ్ గా డిపాజిట్ చేస్తారు. దాని ద్వారా వచ్చే ఆదాయం తోపాటు, ఫ్లాట్ల లో నివసించే వారి నుంచి మెయిన్ టెయిన్స్ రూపేణా ప్రతి నెలా వసూలు చేసే మొత్తంతో ఆయా కాలనీల నిర్వహణను చేపడతారు. ప్రధానంగా కామన్ ఏరియాల్లోని లైట్లు, లిఫ్టులు, బోరింగ్ మొదలైన వాటి నిర్వహణ ఖర్చులతో పాటు, అత్యవసరంగా అవసరమైన చిన్నచిన్న మరమ్మత్తులు మొదలైన వాటి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, ఈ నిధులను వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా కాలనీల్లోని దుకాణాల ద్వారా పలువురికి ఉపాథి లభించడంతోపాటు స్థానికులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
వేలం నిర్వహించే తేదీలు
ఏప్రిల్ 9,10 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని 8 కాలనీల్లో 273 దుకాణాల వేలం ప్రక్రియ అనంతరం 15, 16 తేదీల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 కాలనీల్లోని 77 దుకాణాలకు, ఏప్రిల్ 15 మరియు 17తేదీల్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లోని 892 షాపులకు , సంగారెడ్డి జిల్లా పరిధిలోని 6 కాలనీల్లోని 372 షాపులకు 15 నుంచి 18 వ తేదీ వరకు, మరియు 21 వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ దుకాణాల విక్రయాలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ లను సంప్రదించవచ్చని ఎండి శ్రీ విపి గౌతం వివరించారు.


