జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.
సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డికి ఫెడరేషన్ విజ్ఞప్తి
ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై చొరవచూపాలని వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 28
రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ సమాచార భవన్లో స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి ని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు,
కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. గత 40 ఏండ్లుగా తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి కి అవగాహన ఉన్నదనీ, ఇండ్లస్థలాలు పరిష్కరించే విషయంలో చొరవచూపాలని ముకుంద్ రెడ్డి కి సూచించారు. అక్రెడిటేషన్ల విషయంలో
రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారనీ, ప్రింటింగ్ కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లో అవసరమైన మేర అక్రిడిటేషన్ కార్డులను జారీచేయాలని కోరారు. హెల్త్ కార్డులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా ఇవ్వాలనీ, జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం కల్పించాలనీ, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని కోరారు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసిన నేపథ్యంలో వేజ్ బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనీ, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తరహాలో తెలంగాణాలో కూడా ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు సరిపోవనీ, నిధులు పెంచి ఎక్కువ మంది జర్నలిస్టులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని మీడియాలో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ వేయాలని ప్రత్యేక కమిషనర్ కు ఫెడరేషన్ బృందం సూచించింది.

