తెలంగాణ పోలీసులకు డీజీపీ కఠిన హెచ్చరిక – ఇక అవినీతికి నో టాలరెన్స్
* ఖాకీ యూనిఫామ్ మరియు అవినీతి కలిసి ఉండవు అని డీజీపీ స్పష్టం
* హోం గార్డ్ నుంచి ఐపీఎస్ వరకు అందరికీ ఒకే రూల్ – నో కరప్షన్
* ఖాకీ ధరించినప్పుడు అవినీతి ఆలోచనకే చోటు ఉండకూడదు
* పోలీసులపై ప్రజల నమ్మకం దెబ్బతింటే వ్యవస్థే బలహీనపడుతుంది
* ACB దాడుల్లో పోలీసులే పట్టుబడుతున్న ఘటనలపై తీవ్ర ఆందోళన
హోం గార్డ్స్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ స్పష్టమైన సందేశం ఇచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి — “యూనిఫామ్ మరియు అవినీతి కలిసి ఉండవు… ఉండలేవు కూడా!”
ఖాకీ అంటే కేవలం ఒక డ్రెస్ కాదు… అది బాధ్యత, నమ్మకం, ప్రజల భద్రతకు ప్రతీక. అలాంటి ఖాకీ ధరించిన ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనలో పారదర్శకత, క్రమశిక్షణ, నిజాయితీ చూపించాలని డీజీపీ స్పష్టం చేశారు. “ఒంటిపై ఖాకీ ఉన్నప్పుడు… మనసులో అవినీతి ఆలోచనకు కూడా చోటు ఉండకూడదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ACB) దాడుల్లో పోలీస్ సిబ్బంది పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం శాఖ ప్రతిష్టకు పెద్ద దెబ్బగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పోలీసులను భరోసాగా చూసే సమయంలో… అదే వ్యవస్థలో అవినీతి చోటు చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
“ప్రజల రక్షణ కోసం నియమితులైన వారు అక్రమాలకు పాల్పడితే… అది కేవలం తప్పు కాదు, నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి సడలింపులు, రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత సిఫార్సులు పనిచేయవని తేల్చి చెప్పారు.
హోం గార్డ్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను నిబద్ధతతో నిర్వహించాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని సూచించారు. “లంచం అనే చిన్న తప్పు… కెరీర్ను పూర్తిగా నాశనం చేస్తుంది” అని హెచ్చరించారు. తప్పుదోవ పట్టిన వారిని శాఖలో సహించబోమని స్పష్టం చేశారు.
పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారికి బాధ్యత అని పేర్కొన్నారు. “ఫెయిర్ (న్యాయం), ఫర్మ్ (దృఢత్వం), ఫ్రెండ్లీ (స్నేహపూర్వకత), ప్రొఫెషనల్ (వృత్తిపరమైన నైపుణ్యం)” అనే నాలుగు మూల సూత్రాలపై పోలీస్ వ్యవస్థ నడవాలని డీజీపీ మరోసారి గుర్తు చేశారు.
చివరిగా… “బాధ్యత మరచిపోతే… చర్యలు తప్పవు. దారి తప్పితే… ఖాకీ కోల్పోతారు” అంటూ శాఖ మొత్తం గట్టిగా హెచ్చరించారు.

