Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కచ్చిర్ కాడి ముచ్చట్లు...

Author
Posted By TEHELKA DAILY
| 23 Oct 2026, 09:23 AM |
కచ్చిర్ కాడి ముచ్చట్లు...

IAS, IPS కావాల్సిన బిడ్డల్ని.......
రాజకీయ వారసులుగా ఎందుకు మారాలనీ అనుకుంటున్నారు ...?

చదివినోడు.... చదువు కన్నా పలుకుబడున్నోడు పెత్తనం ముందు " ఎస్ సర్ " అనాలే....!
ఇయ్యాల మనూరు కచ్చిర్ కాడి ముచ్చట్ల ఎజెండా కొంచెం ఘాటుగనే ఉంటది. ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ముచ్చట కాదు..మన సమాజం ఆలోచనా విధానానికి సంబంధించిన ముచ్చట!ఒక బిడ్డ IAS కావాలంటే ఏండ్ల తరబడి చదవాలె..!IPS కావాలంటే కఠినమైన పరీక్షలు దాటాలె..!కానీ ఒక నాయకుడి వారసుడిగా రాజకీయాల్లోకి రావాలంటే ఆ కుటుంబంపేరు, పలుకుబడి, రాజకీయ పరిచయాలు చాలాసార్లు అదనపు అవకాశాలు కల్పిస్థాయి..
ఇదేనా...!మన సమాజంల పెరుగుతున్న అసమానత?ఒక్కసారి దిమాకుతో ఆలోచించుండ్రి...!చదువుకోమని చెప్పాల్సిన తల్లిదండ్రులే..!పిల్లలను రాజకీయాల వైపు ఎందుకుమల్లమని ప్రోత్సహిస్తున్నారు ఇందులోనే దాగి ఉంది అసలు మతాలబ్....!ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని కలెక్టర్ కావాలె, IAS కావాలె, IPS కావాలె, ఉన్నతాధికారులుగా ఎదగాలె అని కలలు కనేటోళ్లు. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివించేటోళ్లు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే తమ కుటుంబం తలెత్తుకొని బతుకుతదని ఆశపడేటోళ్లు....
మరి ఇయ్యాల కొంతమంది తల్లిదండ్రుల ఆలోచనల్లో రాజకీయ పదవుల మీద ఆకర్షణ ఎందుకు పెరుగుతున్నది?

“సదువుకొని ఏం సాధిస్తవురాబిడ్డా.......!రాజకీయాల్లోకిరా.....!

నాయకుడివి అవ్వు! నలుగురిని వెంటేసుకో! పదవి సంపాదించు! పలుకుబడి పెంచుకో!” అనే ఆలోచన ఎందుకు బలపడుతున్నది?ప్రశ్నించాల్సింది రాజకీయాలను కాదు.. రాజకీయాలనే అధికారం, హోదా, పలుకుబడికి సులభమైన దారిగా చూసే మనస్తత్వాన్ని!రాజకీయాలు కూడా ప్రజాసేవకు గొప్ప వేదికే. కానీ ప్రజాసేవ పక్కకు పోయి పదవులే ప్రధాన లక్ష్యంగా మారితేనే అసలు సమస్య మొదలైతది.IAS, IPS అధికారులే నాయకుల ముందు అణిగిమణిగి ఉండాలా?
ఒక IAS అధికారి కావాలంటే దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గాలె. IPS కావాలంటే కూడా ప్రతిభ, క్రమశిక్షణ, శిక్షణతో ముందుకు రావాలె.....!

ఎన్నో ఏండ్ల కష్టం, కుటుంబ త్యాగం, వ్యక్తిగత పట్టుదల వెనక ఉంటయి.
కానీ అధికార బాధ్యతలు నిర్వహించే సందర్భంలో ఒక అధికారి ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వాల్సి వస్తది.
అది ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. అయితే ఆ గౌరవాన్ని వ్యక్తిగత బానిసత్వంగా మార్చే ప్రయత్నం జరిగితే మాత్రం ప్రశ్నించాల్సిందే!ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున పనిచేసే నాయకుడు.
అధికారి అంటే చట్టాన్ని అమలు చేసే బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగి.
ఇద్దరూ ప్రజల కోసమే పనిచేయాలె......!మరి ఒకరు మరొకరిని తక్కువ చేసి చూసే హక్కు ఎవరిచ్చిన్రు?
అధికారి చట్టానికి కట్టుబడి ఉండాలె......!నాయకుడు కూడా చట్టానికి లోబడే పనిచేయాలె.....! నాయకుడి మాట చట్టం కాదు.
అధికారం ఉన్నంత మాత్రాన ఎవరూ ప్రశ్నలకు అతీతులు కారు.మరి మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నం?
అధికారిగా ఎదిగి వ్యవస్థను నడిపించమంటున్నమా? లేక పలుకుబడి సంపాదించి అధికారుల చేత దండాలు పెట్టించుకునే స్థాయికి ఎదగమంటున్నమా?ఈ ప్రశ్న ప్రతి తల్లిదండ్రి తనను తాను వేసుకోవాల్సిందే.....!

రాజకీయ వారసత్వం.. ప్రజాస్వామ్యమా....?కుటుంబ ఆధిపత్యమా...?

దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను గమనించుండ్రి.
అనేక రాజకీయ కుటుంబాల్లో ఒక తరం తర్వాత మరో తరం నాయకత్వంలోకి వస్తున్నది.
తండ్రి తర్వాత కొడుకు, తల్లి తర్వాత కూతురు, కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా రాజకీయాల్లోకి వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నయి.ఇందులో తప్పేముంది అని కొందరు అడగొచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కుటుంబాలకు చెందినవాళ్లు కూడా పోటీ చేయొచ్చు. ప్రజలు ఎన్నుకుంటే పదవులు చేపట్టొచ్చు. అందులో సందేహం లేదు కానీ అసలు ప్రశ్న అదికాదు....!సామాన్యుడి బిడ్డకు, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం బిడ్డకు ఒకే స్థాయి అవకాశాలు ఉన్నాయా?
ఒక సామాన్య కుటుంబం బిడ్డ రాజకీయాల్లోకి రావాలంటే ప్రజల్లో గుర్తింపు సంపాదించాలె.......!
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలె. పార్టీ నాయకత్వం దగ్గర అవకాశాల కోసం ప్రయత్నించాలె.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు, ప్రచారం, కార్యకర్తలు వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతయి.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు మాత్రం పేరు, పరిచయాలు, సంస్థాగత సంబంధాలు వంటి ప్రయోజనాలు ముందే అందుబాటులో ఉండొచ్చు.

అందుకే అడుగుతున్నం....!

ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఉండటమా?
లేక రాజకీయాల్లో ఉన్న కుటుంబాల వారసులకే అవకాశాలు సులభంగా దక్కటమా?
ప్రజల ఓటుతో గెలవడం ఒక విషయం.
ప్రజల ముందుకు వచ్చే అవకాశాలే కొందరి చేతుల్లో ఎక్కువగా కేంద్రీకృతం కావడం మరో విషయం.
ఈ తేడా గురించి మాట్లాడితే తప్పేంటి?

చదువుకున్నోడు ఉద్యోగం కోసం పరీక్ష రాయాలె..!
రాజకీయ వారసుడికి మాత్రం వారసత్వమే అర్హతా...?

ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్ష రాస్తే అతడి ప్రతిభను పరీక్షిస్తరు.
అర్హతలు చూస్తరు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించాలె.....!
కానీ రాజకీయాల్లో వారసత్వంగా వచ్చే అవకాశాల విషయంలో మనం అదే ప్రశ్న అడుగుతున్నమా?
నాయకుడి బిడ్డ కాబట్టి నాయకుడే కావాల్నా? రాజకీయ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రజలకు సేవ చేసే అర్హత వచ్చినట్టేనా?

సామాన్య కుటుంబంలో పుట్టినంత మాత్రాన నాయకత్వానికి దూరంగా ఉండాల్నా?

రాజకీయ నాయకత్వం ఎవరి కుటుంబ ఆస్తి కాదు.
ప్రజాస్వామ్యంలో అది ప్రజల విశ్వాసంతో సంపాదించాల్సిన బాధ్యత!
నాయకుడి వారసుడు రాజకీయాల్లోకి రావొచ్చు.
కానీ అతడిని ప్రజలు అతను చేస్తున్న సేవ పనులు,నిబద్ధత, ప్రజలతో సంబంధం, జవాబుదారీతనం ఆధారంగా అంచనా వేయాలి.
అదే కొలమానం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నాయకులకూ వర్తించాలి...

తల్లిదండ్రులారా......!

ఇవి కూడా చదవండి

పిల్లలకు పదవుల వెనుక పరిగెత్తడం కాదు,విలువలతో ఎదగడం నేర్పించుండ్రి....!మీ బిడ్డ IAS కావాలనుకుంటే ప్రోత్సహించుండ్రి.IPS కావాలనుకుంటే అండగా నిలబడుండ్రి. శాస్త్రవేత్త కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఉపాధ్యాయుడు కావాలన్నా, వ్యాపారవేత్త కావాలన్నా వారి కలలకు దారి చూపించుండ్రి.రాజకీయాల్లోకి రావాలనుకుంటే కూడా ప్రోత్సహించుండ్రి. కానీ ప్రజల సమస్యలు అర్థం చేసుకోమని చెప్పుండ్రి. ప్రజల హక్కుల కోసం నిలబడమని నేర్పించుండ్రి. అధికారాన్ని సేవకు ఉపయోగించమని చెప్పుండ్రి.

పిల్లలకు ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పుండ్రి....

బిడ్డా....! పెద్ద పదవిలో ఉండటం గొప్ప కాదు.
ఆ పదవిని ఉపయోగించి ప్రజలకు ఎంత మేలు చేశావన్నదే గొప్ప..  !

IAS అయినా, IPS అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. ప్రజల పట్ల బాధ్యత లేకపోతే...!
ఆ పదవికి అర్థం లేదు.
ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి ఉంటే ఏ రంగంలో ఉన్నా సమాజానికి ఉపయోగపడొచ్చు.

చివరగా.. కచ్చిర్ కాడి ముచ్చట్ల నుంచి సూటి ప్రశ్న...?

మన సమాజంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలి.
ప్రతిభకు గుర్తింపు రావాలి. రాజకీయాల్లోకి వచ్చే సామాన్య యువతకు కూడా సమాన అవకాశాలు ఉండాలి.
రాజకీయ వారసత్వం ఉన్నవాళ్లూ తమ పనితోనే ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలి.
అధికారులు నాయకుల వ్యక్తిగత ఆదేశాలకు కాదు, చట్టానికి కట్టుబడి పనిచేయాలి. నాయకులు అధికారాన్ని వ్యక్తిగత హోదాగా కాకుండా ప్రజలు అప్పగించిన బాధ్యతగా చూడాలి.ఎందుకంటే....? ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కంటే పైవాడు కాదు.ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాప్రతినిధి మాత్రమే ....  !

ఇగ మీరే చెప్పుండ్రి...!

ఒక బిడ్డ IAS, IPS అయి చట్టబద్ధంగా ప్రజలకు సేవ చేయాలనే కల కనడం గొప్పదా?
రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యల కోసం పోరాడాలనే లక్ష్యం గొప్పదా?
రెండింటినీ గౌరవించే సమాజాన్ని నిర్మించడం గొప్పదా?
మనకు కావాల్సింది ఏ రంగంలో ఉన్నా బాధ్యతతో పనిచేసే యువత. కుటుంబ పేరు మీద కాకుండా తన ప్రతిభ, తన పనితో గుర్తింపు తెచ్చుకునే తరం.
పదవి కోసం రాజకీయాలు వద్దు..
ప్రజల కోసం రాజకీయాలు కావాలి!
వారసత్వంతో వచ్చిన హోదా కాదు..
ప్రజల విశ్వాసంతో సంపాదించిన గౌరవమే నిజమైన నాయకత్వం!

ఇదే ఇయ్యాల మన కచ్చిర్ కాడి ముచ్చట్ల ఘాటు ప్రశ్న......!
ఆలోచించుండ్రి.. చర్చించుండ్రి.. మన పిల్లలకు ఎలాంటి సమాజాన్ని అందించాలనుకుంటున్నమో నిర్ణయించుండ్రి!
IAS అయినా...! అయ్యా అనే భ్రమల నుంచి తల్లి తండ్రులు బయటపడాలి...
తమ బిడ్డలు రాజ్యాంగానికి కట్టుబడి విధి నిర్వహణలు చేసి ప్రజా మన్నలు పొందితే....!
రాజకీయ నాయకుని హోదా కంటే అత్యున్నత హోదా మీదే బిడ్డా అని హితవు చెప్పండి.
IAS, IPS, పోస్టుల్లో ఉన్న బిడ్డలు మీరు కుల రహిత, అవినీతి, అక్రమార్జన రహిత, నిరఫరాదికి న్యాయం జరిగేలా సేవలు చేయండి అప్పుడే అందరూ కోరుకుంటున్న మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఉద్బోధించండి.

చెప్పాల్సింది చాలా ఉంది....
చదవాల్సింది మిగిలే ఉంది...

సకినాల సుధాకర్ పటేల్.
సీనియర్ జర్నలిస్టు.