
కూకట్ పల్లి తెహెల్కా న్యూస్ ప్రతినిధి తెల్ల హరికృష్ణ ఏప్రిల్ 22 :
కూకట్ పల్లి ప్రాంతానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పే అరుదైన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముందు భాగంలో 27 అడుగుల గరుస్మంతుడు(గరుడ) మరియు ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం పురస్కరించుకొని కూకట్ పల్లి పురవీధులలో విగ్రహాల మహా ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల జైజైధ్వానాలు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాలు, వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది. ఈ పుణ్యకార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందుతూ ప్రాంత ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, కూకట్ పల్లి రామాలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. గరుడుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపనతో ఆలయ మహిమ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న రామభక్తులందరినీ వడ్డేపల్లి రాజేశ్వరరావు పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఊరేగింపులో సందడి చేశారు, కూకట్ పల్లి ప్రాంతంలో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన మహోత్సవంగా నిలిచింది.

